డబ్బు దాచుకున్నవారికే సమాజంలో విలువ ఉంటుంది : చంద్రమోహన్
on Nov 11, 2023
నటుడు చంద్రమోహన్ జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం. మేడూరు, బాపట్లలో ఆయన విద్యాభ్యాసం జరిగింది. కళాతపస్వి కె.విశ్వనాథ్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆయనకు సమీప బంధువులు. చంద్రమోహన్ భార్య జలంధర, కుమార్తెలు మధుర మీనాక్షి, మాధవి. ఇద్దరికీ పెళ్ళిళ్లు జరిగాయి. మధుర మీనాక్షి సైకాలజిస్టుగా అమెరికాలో స్థిరపడ్డారు. మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు.
చంద్రమోహన్ తన తొలి సినిమా ‘రంగులరాట్నం’లోని నటనకుగాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘పదహారేళ్ళ వయసు’ చిత్రంలోని విలక్షణమైన నటనకు ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డుకు ఎంపికయ్యారు. 1987లో ‘చందమామ రావే’ చిత్రానికి, ‘అతనొక్కడే’ చిత్రంలో సహాయనటుడిగా నంది అవార్డులు అందుకున్నారు.
తొలిచిత్రం ‘రంగులరాట్నం’ సక్సెస్ అయి, ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న తర్వాత సినిమాల్లో కొనసాగాలా, ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్లాలా.. అని ఆలోచించిన చంద్రమోహన్ సినిమా రంగంవైపే అడుగులు వేశారు. ఆయన తీసుకున్న నిర్ణయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన నటుడు దొరికనట్టయింది. సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకునే వాడ్ని అని చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు. చంద్రమోహన్ మంచి భోజనప్రియుడు. శాకాహారం, మాంసాహారం అనే తేడా లేకుండా రుచికరమైన వంటకాలను ఎంతో ఇష్టంగా తినేవారు. ఈ విషయాన్ని అనేక ఇంటర్వ్యూల్లో స్వయంగా తెలియజేశారు. చుట్టూ వున్న సమాజంపై ఎంతో అవగాహనతో ఉండే చంద్రమోహన్ ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు.. డబ్బు దాచుకున్న వారికే సమాజంలో విలువ ఉంటుందని.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
